Niraj Sekhar: బీజేపీలో చేరిన మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు
- సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నీరజ్ శేఖర్
- పదవికి, పార్టీకి సోమవారం రాజీనామా
- భూపేంద్ర యాదవ్, అనిల్ జైన్ సమక్షంలో బీజేపీలో చేరిక
భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు భూపేంద్ర యాదవ్, అనిల్ జైన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నీరజ్ శేఖర్... సోమవారమే తన పదవికి, సమాజ్ వాదీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
2009 లోక్ సభ ఎన్నికల్లో బలియా నియోజకవర్గం నుంచి నీరజ్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభకు సమాజ్ వాదీ పార్టీ పంపించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నీరజ్ కు టికెట్ ను కేటాయించపోవడంతో... ఆయన అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో, ఎస్పీకి ఆయన గుడ్ బై చెప్పారు. మరోవైపు, యూపీ నుంచి ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
1990-91 మధ్య కాలంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఏడు నెలల పాటు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నారు. చంద్రశేఖర్ సమాజ్ వాదీ పార్టీలో లేనప్పటికీ... ఆయన పోటీ చేసిన బలియా నియోకవర్గంలో ఎప్పుడూ ములాయం సింగ్ యాదవ్ తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. 2007లో ఆయన మరణించారు. దీంతో, అప్పుడు నిర్వహించిన ఉపఎన్నికలో నీరజ్ ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.