Andhra Pradesh: అమరావతి తాత్కాలిక భవనాల్లో సరైన వెంటిలేషన్ లేదు.. అధికారులకు ఊపిరితిత్తుల సమస్య వస్తోంది: ఏపీ మంత్రి బుగ్గన
- తాత్కాలిక భవనాల్లో చదరపు అడుగు రూ.12 వేలతో నిర్మించారు
- చినుకు పడినా ఈ భవనాల్లో వర్షపు నీరు వస్తోంది
- బడ్జెట్ ను పూర్తిగా చదివితే మా ప్రాధాన్యతలు అర్థమవుతాయి
రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక భవనాల్లో సరైన వెంటిలేషన్ లేక అధికారులకు ఊపిరితిత్తుల సమస్య వస్తోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కట్టడాల్లో చదరపు అడుగు రూ.12 వేలతో నిర్మించారని, చిన్న చినుకు పడినా తాత్కాలిక భవనాల్లో వర్షం నీరు చేరుతోందని అన్నారు. హైదరాబాద్ లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో చదరపు అడుగును రూ.5 వేలకే నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. అమ్మఒడి పథకానికి రూ.6456 కోట్లు కేటాయింపులు జరిగాయని, టీడీపీ సభ్యులు దీనిపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ ను పూర్తిగా చదివితే తమ ప్రాధాన్యతలు అర్థమవుతాయని, వ్యవసాయానికి, గ్రామీణ అభివృద్ధికి, పారిశ్రామిక రంగం, సాగు నీరుకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.