Srikakulam District: శ్రీకాకుళంలో ఒడిశా యువతి హత్య... మూడేళ్ల తరువాత వెలుగు చూసిన అసలు నిజమిది!
- అచ్చం సినిమా కథలా హత్య
- తృప్తి పాండా ప్రియుడే హంతకుడు
- ఫ్యాక్షన్ హత్యలకు జడిసి లొంగిపోయిన చిక్కల కుమార్ బెహరా
- మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు
ఒడిశాలొని ఛత్రపురానికి చెందిన తృప్తి పాండా(30) హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య చేసిన ప్రియుడు చిక్కలకుమార్ బెహరా ఫ్యాక్షన్ గొడవలకు జడిసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘోరాన్ని తానే చేసినట్లు ఒప్పుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒకే గ్రామానికి చెందిన చిక్కలకుమార్ బెహరా, తృప్తి పాండా, అనురాధ మహంతిలు స్నేహితులు. వీరు ముగ్గురూ డిగ్రీ కలిసి చదువుకున్నారు. ఆ క్రమంలోనే చిక్కల కుమార్, తృప్తి పాండాలు ప్రేమించుకున్నారు. ఆ సమయంలోనే చిక్కలకుమార్ సోదరుడు శకురా బెహరా ప్రత్యర్థి వర్గం దాడిలో హత్యకు గురయ్యాడు. వారిపై ప్రతీకార హత్యకు పాల్పడిన చిక్కలకుమార్ అనంతరం గ్రామం విడిచి హైదరాబాదుకు మకాం మార్చాడు.
అప్పటికే కంప్యూటర్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న తృప్తి పాండాకు మరో యువకుడు టిల్లు మహంతి అనే వ్యక్తితో చనువు పెరిగింది. ఈ విషయం చిక్కలకుమార్ కు తెలిసింది. మనసులోనే ఆమెపై పగ పెంచుకున్నా పైకి తృప్తి పాండాతో స్నేహం నటించాలనుకున్నాడు. దాంతో స్నేహితురాలు అనురాధతో ఫోన్ లో మాట్లాడిన చిక్కలకుమార్ తృప్తితో మాట్లాడించాలని కోరాడు. ఆమె అతను కోరినట్లే తృప్తిని చిక్కలకుమార్ తో మాట్లాడించింది. అనంతరం కొన్ని రోజులకు అతను హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్నాడు.
2016 ఆగస్ట్ 25న చిక్కలకుమార్ ప్రియురాలు తృప్తిని బైక్ పై ఎక్కించుకుని సోంపేట మండలం బారువ బీచ్ కు తీసుకువెళ్లాడు. అక్కడ సాయంత్రం వరకూ గడిపి తిరిగి ఒడిశా తిరుగు ప్రయాణమయ్యారు. ఆ రాత్రి 9.30 సమయంలో తృప్తితో కావాలని గొడవ పెట్టుకున్న చిక్కలకుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఏమీ ఎరగనట్లు కత్తిని అక్కడే పాతిపెట్టి ఛత్రపూర్ వెళ్లాడు. అక్కడ కూడా ఉండకుండా పని ఉందంటూ హడావుడిగా హైదరాబాద్ ఉడాయించాడు. పోలీసులు అతని కోసం ఢిల్లీ, ముంబయి, గోవా, హైదరాబాద్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి ఫ్యాక్షన్ గొడవల్లో తన ప్రత్యర్థులు తనను చంపేస్తారేమోనన్న భయంతో, తనంతట తనే హంతకుడు పోలీసులకు లొంగిపోవడంతో హత్య కేసు కొలిక్కి వచ్చింది.