Jet Airways: జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులను ఆదుకునేందుకు కదిలిన కేంద్రం!
- జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగుల కోసం ప్రభుత్వ వెబ్ సైట్
- ఉద్యోగులకు ఏవియేషన్ శాఖ మద్దతు
- స్పైస్ జెట్, ఇండిగోలలో ఉద్యోగాల కల్పనకు సహకారం
- రాజ్యసభలో మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడి
కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఉద్యోగాల కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. స్పైస్ జెట్, ఇండిగో తదితర విమానయాన సంస్థల్లో ఉద్యోగ సమాచారాన్ని ఆ యాప్ లో పొందుపర్చనున్నారు. రుణ భారంతో అర్ధాంతరంగా ఇటీవల జెట్ ఎయిర్ వేస్ సంస్థ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి పూర్తిగా విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. అప్పటికి ఆ సంస్థలో 20 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
అందులో పలువురు ఇతర సంస్థల్లో ఉద్యోగాల్లో చేరిపోయారు. మిగిలిన వారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వ శాఖ వారికి బాసటగా నిలుస్తోంది. జెట్ ఎయిర్ వేస్ రుణభారం విషయంలో తాము ఆ సంస్థకు చేయూత ఇవ్వలేకపోయినా అందులోని ఉద్యోగుల ఉపాధి కోసం సహకరించనున్నట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగుల కోసం వెబ్ సెట్ సిద్ధం చేశామన్నారు. అందులో జెట్ సిబ్బంది తమ వివరాల్ని పొందుపర్చి తాజా ఉద్యోగావకాశాల సమాచారాన్ని అందిపుచ్చుకోవచ్చన్నారు. జెట్ ఎయిర్ వేస్ ప్రయివేట్ సంస్థ అనీ, ఆ సంస్థ వ్యాపార లావాదేవీల్లో నష్టపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకోబోదని మంత్రి పురి వివరించారు.