Arunachal Pradesh: ముగ్గురు ఎమ్మెల్యేలను నిండా ముంచిన మోసగాడు.. కేబినెట్ బెర్త్‌లు ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు
- ఎంపీ పీఏనని నమ్మబలికిన నిందితుడు
- మంత్రి పదవులు ఇప్పించాల్సిందిగా కోరిన ఎమ్మెల్యేలు
- డబ్బులు దండుకుని మాయం
ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇప్పిస్తానని నమ్మబలికి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. ఎమ్మెల్యేలను మోసం చేసిన నిందితుడికి పోలీసులు అరదండాలు వేశారు.
ఢిల్లీకి చెందిన సంజయ్ తివారీ అనే వ్యక్తి ఓ ఫంక్షన్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలను కలిశాడు. తనను తాను ఫలానా ఎంపీ పీఏనని పరిచయం చేసుకున్నాడు. రాజకీయ పరమైన విషయాల్లో తాను సాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చాడు. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ కేబినెట్‌లో తమకు చోటు కల్పించాల్సిందిగా ఎమ్మెల్యేలు అతడిని కోరారు.
దీంతో తాను ఎంపీతో మాట్లాడతానని చెప్పి వారికి అభయం ఇచ్చాడు. ఆ తర్వాత వారికి ఫోన్ చేసి తాను మాట్లాడానని, డబ్బులు పంపమన్నారని ఎమ్మెల్యేలకు చెప్పాడు. దీంతో వారు తివారీ బ్యాంకు ఖాతాకు అతడు చెప్పిన మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే, ఆ తర్వాతి నుంచి అతడు పత్తాలేకుండా పోయాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్‌ను అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.