Srikalahasti: ఆంధ్రప్రదేశ్ లో వున్న ఈ ఆలయం గ్రహణాలకు అతీతం!
- గ్రహణాలకు అతీతంగా వాయులింగేశ్వర క్షేత్రం
- ప్రత్యేకత సంతరించుకున్న శ్రీకాళహస్తి ఆలయం
- గ్రహణ సమయంలో రాహుకేతు దోష నివారణ పూజలకు ప్రశస్తి
భూమికి సూర్యుడు జీవదాత. చంద్రుడు చల్లని వెలుగులు పంచుతాడు. అలాంటి సూర్యచంద్రులను రాహుకేతువులు మింగడాన్ని అరిష్టంగా భావిస్తారు. రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడం వల్లనే గ్రహణాలు ఏర్పడతాయన్నది పురాణ కాలం నుంచి వస్తున్న నమ్మిక. రాహుకేతువులు దుష్టగ్రహాలు అయినందున వాటినుంచి గ్రహణ సమయంలో చెడు కిరణాలు ప్రసరిస్తాయని, ఆ కిరణాలు ఆలయాలపై పడితే అశుభం అని భావిస్తారు. అందుకే గ్రహణం వేళ ఆలయాలు మూసివేస్తారు.
కానీ, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం మాత్రం అందుకు అతీతం. ఈ భూమ్మీద గ్రహణ సమయంలో తెరిచి ఉంచే ఏకైక ఆలయం ఇదొక్కటే. ఇక్కడ కొలువై ఉన్న ప్రధాన శివలింగంపై ఏర్పాటు చేసిన కవచంలో 27 నక్షత్రాలు, 9 గ్రహ రాశులు ఉంటాయి. సౌరవ్యవస్థ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి వాయులింగేశ్వరుడి అదుపాజ్ఞల్లోనే వాటి కదలికలు కూడా ఆధారపడి ఉంటాయని, దాంతో గ్రహణాలు ఈ ఆలయాన్ని ఏమీచేయలేవని, వాటి ప్రభావం ఇక్కడి క్షేత్రంపై శూన్యమని నమ్ముతారు. ఈ కారణంగానే, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్లు గ్రహణ సమయాల్లో శ్రీకాళహస్తీశ్వరాలయంలో దోషనివారణ పూజలు చేయించుకుంటే శుభం జరుగుతుందని భావిస్తారు.