YV Subba Reddy: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తిరిగి అర్చనానంతర దర్శనం అమలు!
- తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- పాలనా సౌలభ్యం కోసమే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్
- టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముందు చెప్పినట్టుగానే వీఐపీలకు వారి స్థాయిని బట్టి కేటాయిస్తున్న బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాల రద్దుకు ఆదేశించినట్టు ఈ ఉదయం ఆయన తెలిపారు.
తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన, బ్రేక్ దర్శనాల రద్దు తరువాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లను తక్షణమే అమలు చేస్తామని అన్నారు. మరింతమంది సామాన్యులకు స్వామి దర్శనాన్ని కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఇదే సమయంలో గతంలో రద్దు చేసిన అర్చనానంతర దర్శనాన్ని తిరిగి ప్రవేశపెట్టనున్నామని అన్నారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించానని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.