saravan bhavan: హత్య కేసులో జీవిత ఖైదు ఎదుర్కుంటున్న ‘శరవణ భవన్’ వ్యవస్థాపకుడు రాజగోపాల్ ఆరోగ్య పరిస్థితి విషమం
- చెన్నైలోని స్టాన్లీ వైద్యశాలలో చికిత్స
- శ్వాసకోశ సంబంధిత సమస్యతో రాజగోపాల్
- వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు
ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నశరవణ భవన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని రాజగోపాల్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. చెన్నైలోని స్టాన్లీ వైద్యశాలలో ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం పుళల్ జైలుకు తరలించడానికి ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని స్టాన్లీ వైద్యశాలకు పోలీసులు తీసుకెళ్లారు.
అయితే, వైద్య పరీక్షల అనంతరం ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఆయనకు షుగర్, కిడ్నీ వ్యాధులు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి రాజగోపాల్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన పల్స్ రేట్ పడిపోయిందని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని సమాచారం.
కాగా, ఇండియా ‘దోశా కింగ్’ గా రాజగోపాల్ ప్రసిద్ధి, 1981లో చెన్నైలో శరవణ భవన్ హోటల్ ను రాజగోపాల్ స్థాపించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. జర్మనీ, కెనడాతో పలు దేశాల్లో శరవణ భవన్ హోటల్స్ ఉన్నాయి.
ఇదిలా ఉండగా, 2001లో ఓ వివాహితను తన మూడో భార్యగా చేసుకోవాలని రాజగోపాల్ యత్నించాడు. ఈ క్రమంలో ఆమె భర్తను కిరాయి గూండాలతో హత్య చేయించి, తమిళనాడులోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ హత్య కేసుతో రాజగోపాల్ కు సంబంధం ఉందని నిర్ధారణకు వచ్చిన సుప్రీంకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.