Telangana: బీజేపీ నేత మురళీధర్ రావు పీఏపై ఆరోపణలు..హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్
- మురళీధర్ రావు పీఏ, కారా అడ్వయిజరీ కమిటీ నేషనల్ చైర్మన్ పై ఆరోపణలు
- ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు చేపట్టని పోలీసులు
- హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రవర్ణ రెడ్డి
తనకు కేంద్రంలో నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పీఏ కిశోర్, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) అడ్వయిజరీ కమిటీ నేషనల్ చైర్మన్ ఎం.రామచంద్రారెడ్డిలు తన నుంచి డబ్బు తీసుకున్నారంటూ ప్రవర్ణరెడ్డి అనే వ్యక్తి గతంలో ఆరోపించారు. మురళీధర్ రావు, ఆయన అనుచరులు, కిశోర్, రామచంద్రారెడ్డిలపై చర్యలు చేపట్టాలని కోరుతూ గతంలో సరూర్ నగర్ పోలీస్టేషన్ లో నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో పిటిషనర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రవర్ణ రెడ్డి పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. ఈ కేసు దర్యాప్తులో ఎందుకు జాప్యం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా నిందితులపై చార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నటు న్యాయస్థానం పేర్కొంది. తనకు నామినేటెడ్ పదవి ఇప్పిస్తామని చెప్పి తన వద్ద నుంచి కిశోర్, రామచంద్రారెడ్డిలు రూ.3 కోట్లు తీసుకున్నారని, తనకు ఆ పదవి ఇప్పించకుండా మోసం చేశారని ప్రవర్ణరెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు.