Jagan: పెన్నా సిమెంట్ కేసులో పప్పులో కాలేసిన ఈడీ... వైఎస్ జగన్ కు రిలీఫ్!
- రూ. 11 కోట్ల లబ్దికి రూ. 45 కోట్లు లంచమా?
- నమ్మశక్యంగా లేదన్న అపిలేట్ ట్రైబ్యునల్
- రూ. 6.60 కోట్లు కడితే అటాచ్ చేసిన ఆస్తులు వదిలేయాలని ఆదేశం
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నమోదైన క్విడ్ ప్రోకో కేసులో పెన్నా సిమెంట్ అటాచ్ మెంట్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన తప్పిదం కారణంగా జగన్ కు రిలీఫ్ లభించింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద అపిలేట్ ట్రైబ్యునల్ లో పెన్నా సిమెంట్ రూ. 11 కోట్ల లబ్దిని పొందిన కారణంగా, జగతి గ్రూప్ లో లంచంగా రూ. 45 కోట్ల పెట్టుబడులను సదరు సిమెంట్ కంపెనీ యాజమాన్యం పెట్టినట్టుగా ఈడీ పేర్కొంది.
దీనిపై అమితాశ్చర్యాన్ని వ్యక్తం చేసిన ట్రైబ్యునల్, "ఇది ఊహకు కూడా అందడం లేదు. అసలు అర్థం కావడం లేదు. ఇది ఎలా సాధ్యం?" అని ప్రశ్నించింది. సదరు సంస్థ యాజమాన్యం సాక్షి పత్రికలో పెట్టిన పెట్టుబడులను వ్యాపార లావాదేవీల కిందే భావిస్తున్నామని పేర్కొంది. సాక్షి పత్రిక ఆవిష్కరణ నుంచి తెలుగులో రెండో అత్యధిక సర్క్యులేషన్ తో నడుస్తోందని గుర్తు చేసింది.
అనంతపురం జిల్లా యాడికి మండలంలోని కామలపాడులో 231 ఎకరాలను, హైదరాబాద్ బంజారాహిల్స్ లో పయొనీర్ హాలిడే రిసార్ట్స్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న హోటల్ ను అటాచ్ చేయకుండా ఉండాల్సిందని పేర్కొంది. పెన్నా సంస్థ రూ. 6.60 కోట్లను డిపాజిట్ చేస్తే హోటల్ భవంతిని విడుదల చేయాలని ఆదేశించింది. కాగా, ఈ కేసు 2011లో నమోదైన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్, పెన్నా కంపెనీలపై పీఎంఎల్ఏ కింద సీబీఐ, ఈడీలు కేసు నమోదు చేసి విచారణ జరిపాయి. కేసులో భాగంగా ఆస్తుల స్వాధీనంపై పెన్నా సిమెంట్ అపిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా, కేసును విచారించిన ట్రైబ్యునల్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.