Hyderabad: నేనెందుకు బీజేపీలో చేరుతా...అది బుర్రలేని వారి ప్రచారం: మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి
- గిట్టని వారు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు
- నేనెప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా
- ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను
భారతీయ జనతా పార్టీలో తాను చేరనున్నానన్నది బుర్రలేని వారి ప్రచారమని, తనకా అవసరం ఏమొచ్చిందని తెలంగాణ సీనియర్ నాయకుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానన్నది గిట్టనివారు చేస్తున్న ప్రచారంగా కొట్టిపారేశారు.
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ ఎంపీగా ఇటీవల పార్లమెంటులో అడుగుపెట్టిన రేవంత్‌రెడ్డి తాజాగా బీజేపీలో చేరనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో షికారు చేస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగే రేవంత్ టీఆర్‌ఎస్ ఓటమే తన లక్ష్యమని పలుమార్లు ప్రకటించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సత్తాచాటారు.
అయితే ఇటీవల రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలయ్యింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించారని, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని స్పష్టం చేశారు.