Andhra Pradesh: తెలుగుదేశం పార్టీ చివరికి ‘తానా’ సభల్లో మాత్రమే మిగులుతుంది!: బీజేపీ నేత రామ్ మాధవ్
- టీడీపీ నేరాలకు నిలయంగా మారిపోయింది
- కాంగ్రెస్ ను మూసేసే బాధ్యత రాహుల్ గాంధీ తీసుకున్నారు
- ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేరాలకు నిలయంగా మారిపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన భయంకరమైన అవినీతి కారణంగానే ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని స్పష్టం చేశారు. చివరికి అమెరికాలో జరిగే ‘తానా’ సభల్లో మాత్రమే టీడీపీ మిగులుతుందని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రామ్ మాధవ్ మాట్లాడారు. పెనం నుంచి పొయ్యిలో పడేందుకు కూడా టీడీపీకి అవకాశం ఇవ్వరాదని వ్యాఖ్యానించారు. 2024 నాటికి ఏపీలో అధికార పార్టీ దిశగా ఎదగాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీని మూసివేసేందుకు మహాత్మాగాంధీ ప్రయత్నించారనీ, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని పూర్తి చేస్తున్నారని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే బాధ్యతను రాహుల్ చూసుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను బీజేపీవైపు ఆకర్షించాలనీ, దేశవ్యాప్తంగా వచ్చిన ఆదరణను ప్రేరణగా తీసుకుని ఏపీలో బలపడాలని బీజేపీ శ్రేణులకు సూచించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న భావన ప్రజల్లో వచ్చిందనీ, ఏపీలో కూడా అందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు సేవ చేయడమే పార్టీ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. బీజేపీలో గ్రూపు రాజకీయం, ధన రాజకీయం, కుల రాజకీయం అస్సలు ఉండవన్నారు. ఒక్కో కార్యకర్త స్వయంగా 25 మంది కొత్త సభ్యులకు సభ్యత్వం ఇప్పించాలని, అలా చేయని వారు ఏ పదవీ ఆశించడానికి అర్హతే లేదని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.