Bengalore: 20 మంది రౌడీషీటర్లకు బులెట్ రుచిచూపిన బెంగళూరు పోలీసులు!
- నేరాలను అదుపు చేయడానికి కఠిన వైఖరి
- షూట్ చేసి అరెస్ట్ చేస్తున్న బెంగళూరు పోలీసులు
- ప్రాణం తీయడం లక్ష్యం కాదంటున్న అధికారులు
బెంగళూరులో పెరిగిపోతున్న నేరాలను అదుపు చేయడానికి కఠిన వైఖరి అవలంభించాల్సిందేనని, రౌడీషీటర్లకు తుపాకి తూటా రుచి చూపించాల్సిందేనని భావిస్తున్న నగర పోలీసులు, గడచిన ఆరునెలల వ్యవధిలో 20 మందిని షూట్ చేసి, తమదైన శైలిలో హెచ్చరించారు. నగరంలో దారిదోపిడీలు, మోబైల్ చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోతుండగా, వీటిని అరికట్టడానికి కంకణం కట్టుకున్న నగర పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్, రౌడీషీటర్లను పిలిపించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు కూడా. మాట వినకుంటే, వారికి తూటాను రుచి చూపుతున్నారు. బులెట్ గాయాలు తగిలిన వారు ఎవరూ మరణించలేదు.
రౌడీషీటర్లను హతమార్చడం తమ ఉద్దేశం కాదని, వారిని మార్చడమే తమ లక్ష్యమని పోలీసులు అంటున్నారు. రౌడీషీటర్లు ఆకాష్ అలియాస్ మలేరియా, క్యాట్ రాజా, హేమంత్ కుమార్, శ్రీనివాస్, పప్పు, తబ్రేజ్ ఖాన్, దేవరాజు, చంద్రశేఖర్ తదితరులపై పోలీసులు కాల్పులు జరిపి వారిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు లగ్గెరె మునిరాజు, కుమారస్వామి, మన్సూర్ ఖాన్, నమ్ రాజ్ బసాకత్ గోవింద్ అలియాస్ రాహుల్ లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.