UK: ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో లార్డ్స్ మైదానం గగనతలాన్ని 'నో ఫ్లై జోన్'గా ప్రకటించిన యూకే
- రేపు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్
- ఆతిథ్యమిస్తున్న లార్డ్స్ మైదానం
- రెండ్రోజుల పాటు లార్డ్స్ పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ప్రఖ్యాత లార్డ్స్ మైదానం పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. ఈ వరల్డ్ కప్ లోని పలు మ్యాచ్ ల సందర్భంగా, ఆకాశంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ స్టేడియంల మీదుగా విమానాలు వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, ఫైనల్ కు వేదికగా నిలుస్తున్న లార్డ్స్ మైదానం మీదుగా ఆదివారం ఎలాంటి విమానాలు తిరగకూడదంటూ యూకే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు లార్డ్స్ మైదానం గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. లార్డ్స్ మైదానం పైనుంచి చార్టర్డ్ ఫ్లయిట్లు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు.
వరల్డ్ కప్ ఫైనల్ 14వ తేదీన జరగనుండగా, దానికి రిజర్వ్ డేగా జూలై 15వ తేదీని కేటాయించారు. ఈ రెండు తేదీల్లోనూ నో ఫ్లై జోన్ ఆదేశాలు అమలులో ఉంటాయి. వరల్డ్ కప్ లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఓ చిన్న విమానం బ్యానర్ ను ప్రదర్శిస్తూ స్టేడియం మీదుగా వెళ్లింది. కశ్మీర్ లో నరమేధం ఆపండి, కశ్మీర్ కు విముక్తి కలిగించడం అనే నినాదం ఆ బ్యానర్ పై ఉంది.
అంతకుముందు, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ సందర్భంగానూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న నినాదాలతో క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని భావించిన ఐసీసీ ఈ విషయంపై యూకే అధికార వర్గాలకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఫైనల్ సందర్భంగా లార్డ్స్ పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.