Harish Rao: చంద్రయాన్ -2 ప్రయోగంలో పాలు పంచుకుంటున్న తెలంగాణ ముద్దుబిడ్డకు అభినందనలు: హరీశ్‌రావు
- ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములవడం గర్వకారణం
- యావత్ వైజ్ఞానిక రంగానికి మరిన్ని సేవలు అందించాలి
- నా తరుఫున, సిద్ధిపేట ప్రజల తరుఫున శుభాకాంక్షలు
చందమామపై ఇప్పటివరకూ వ్యోమనౌకలను దింపిన ప్రపంచంలోనే నాల్గవ దేశంగా ఇండియా చరిత్రలోకి ఎక్కనుంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే వ్యోమ నౌకలను చంద్రునిపై దింపాయి. ఇప్పుడు వాటి సరసన ఇండియా సగర్వంగా నిలవబోతోంది. ఈ అద్భుత ఘట్టానికి శ్రీహరికోట వేదిక కానుంది.
ఈ 15వ తేదీ తెల్లవారుజామున 2.51కి చంద్రయాన్-2 చంద్రుని వద్దకు పయనం కానుంది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి భాగస్వాములవడం గర్వకారణం. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త వీరబత్తిని సురేందర్ చంద్రయాన్-2 ప్రయోగంలో పాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, సురేందర్‌ను అభినందిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
‘‘భారతదేశ శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వైజ్ఞానిక రంగానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్ -2 ప్రయోగంలో పాలు పంచుకుంటున్న తెలంగాణ ముద్దుబిడ్డ, సిద్ధిపేటకు చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, ఆత్మీయ సోదరుడు వీరబత్తిని సురేందర్ కు మనసారా అభినందనలు.
భారతదేశానికే గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములు కావడం మా అందరికీ గర్వకారణం. భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి, యావత్ వైజ్ఞానిక రంగానికి మీరు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. మరోసారి వ్యక్తిగతంగా నా తరుఫున, సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల తరుఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.