Andhra Pradesh: కోడెల శివరామ్ ఇంటి ముందు మరో బాధితుడి ఆందోళన.. తీసుకున్న రూ.7 లక్షలు వెనక్కి ఇవ్వాలని డిమాండ్!
- అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని శివరామ్ రూ.7 లక్షలు పుచ్చుకున్నాడు
- చివరికి ఉద్యోగం ఇప్పించకుండా తీవ్రంగా వేధించాడు
- పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేయాలన్న బాధితుడు
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ పై పలువురిని మోసగించి, బెదిరించారంటూ ఇప్పటికే పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై మరో ఆరోపణ వచ్చింది. ఇందుకు సంబంధించి కోడెల శివప్రసాద్ ఇంటి ముందు నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. తమ నుంచి వసూలు చేసిన రూ.7 లక్షలను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది.
ఈ విషయమై బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా కలక్టరేట్ లో అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయని కోడెల శివరామ్ చెప్పాడన్నారు. ఆ ఉద్యోగం ఇప్పించాలంటే రూ.7 లక్షలు ఇవ్వాలని శివరామ్ చెప్పడంతో అంత మొత్తం సమర్పించుకున్నట్లు వెల్లడించారు. అయితే డబ్బులు తీసుకున్న శివరామ్ ఉద్యోగం ఇప్పించకుండా తిప్పుకుంటూ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా తమ నగదును వెనక్కి ఇచ్చేయాలని బాధితుడు తన కుటుంబంతో కలిసి కోడెల ఇంటిముందు ఆందోళనకు దిగాడు. శివరామ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు.