Andhra Pradesh: కొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారు .. బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు!
- టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరుతారన్న దత్తాత్రేయ
- కవిత, వినోద్ ఓటమితో కేసీఆర్ పతనం ఆరంభమయింది
- చంద్రబాబు, కేసీఆర్ తెలుగు రాష్ట్రాలకు గ్రహణంలా పట్టారు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముగిసిన నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించిందా? ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకున్న కమలనాథులు ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ లోక్ సభ సభ్యులపై కన్నేశారా? తాజాగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. నిజామాబాద్ లో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి మరికొంత మంది లోక్ సభ సభ్యులు త్వరలోనే బీజేపీలో చేరుతారని ప్రకటించారు. టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ తో పాటు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో పాలన స్తంభించిపోయిందని దత్తాత్రేయ విమర్శించారు. కరీంనగర్ లో బి.వినోద్, నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత ఓటమితో టీఆర్ఎస్ పతనం ప్రారంభమయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగురాష్ట్రాలకు గ్రహణంలా పట్టారని ఆయన దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తే వాటిని ప్రాజెక్టుల కోసం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలోనే కమలం వికసిస్తుందని పునరుద్ఘాటించారు.