icc world cup: రేపే ఇంగ్లండ్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. వివాదాస్పద అంపైర్ కే బాధ్యతలు!

  • చెత్త అంపైరింగ్‌తో విమర్శలపాలు
  • జాసన్ రాయ్ అవుట్ కాకున్నా ఔటిచ్చిన వైనం
  • ఐసీసీపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడు మీదున్న సమయంలో అంపైర్ కుమార ధర్మసేన తప్పుడు నిర్ణయానికి ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌ పెవిలియన్ చేరాడు. కమిన్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి రాయ్ అవుటయ్యాడు. అయితే, అది అవుట్ కాదని రీప్లేలో తేలింది. అంతేకాదు, అది అవుట్ కాదని స్పష్టంగా తెలిసిన రాయ్ మైదానంలోనే అంపైర్ ధర్మసేనతో వాగ్వివాదానికి దిగాడు. రివ్యూలు అయిపోవడంతో ఏమీ చేయలేక మైదానాన్ని వీడాడు. రాయ్‌ను అవుట్‌గా ప్రకటించడంపై నెటిజన్లు మండిపడ్డారు. ప్రపంచకప్‌లో ఇలాంటి చెత్త అంపైరింగ్ ఏంటంటూ ధర్మసేనపైనా, ఐసీసీపైనా దుమ్మెత్తిపోశారు.

విమర్శలను ఏమాత్రం పట్టించుకోని ఐసీసీ ఇంగ్లండ్-కివీస్ మధ్య రేపు జరగనున్న ఫైనల్‌కు కూడా ఆయననే ఎంపిక చేయడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. కీలక మ్యాచ్‌కు ధర్మసేనను ఎలా ఎంపిక చేస్తారంటూ అభిమానుల నుంచి మరోమారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అంపైర్ నిర్ణయాన్ని మైదానంలోనే ప్రశ్నించి వాగ్వివాదానికి దిగిన రాయ్‌పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. మ్యాచ్‌ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో రెండు డీమెరిట్‌ పాయింట్లు వేసింది.

icc world cup
final match
England
Dharmasena
umpire
  • Loading...

More Telugu News