Nara Lokesh: ఆ పథకానికి 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరుపెట్టాలి: నారా లోకేశ్
- అమ్మ ఒడి పథకం అమలుపై లోకేశ్ విమర్శలు
- లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి సగం తగ్గించారంటూ అసంతృప్తి
- ట్వీట్ చేసిన టీడీపీ యువనేత
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నారా లోకేశ్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతున్నారు. జగన్ సర్కారును ఇరకాటంలో పడేయడమే లక్ష్యంగా లోకేశ్ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా, బడ్జెట్ నేపథ్యంలో ఈ టీడీపీ యువనేత మరో ట్వీట్ వదిలారు. అమ్మ ఒడి పథకంలో లబ్ది పొందే తల్లుల సంఖ్యను సగానికి సగం తగ్గించడం సరికాదని విమర్శించారు. "ఒక తల్లికి ఇవ్వడమేంటి? మరో తల్లికి ఇవ్వకపోవడం ఏంటి? ఆ విధంగా స్కిప్ చేసుకుంటూ పోయి జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? ఎలాగూ పథకాలకు మీ పేర్లు పెట్టుకుని మురిసిపోతున్నారు కదా! ఈ పథకానికి 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెట్టుకుంటే సరిపోయేది అంటూ సెటైర్ వేశారు.
అంతేగాకుండా, గృహనిర్మాణాలకు కేవలం రూ.8,165 కోట్లు ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ గారూ, బడ్జెట్ లో గృహనిర్మాణాలకు కేటాయించిన నిధులు చూస్తుంటే మీరు నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్లేమోనని సందేహం వస్తోందంటూ లోకేశ్ మరో ట్వీట్ చేశారు.