krishna river water: ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టా కాలువకు నీరు విడుదల
- శాస్త్రోక్తంగా పూజల అనంతరం గేట్లు ఎత్తివేత
- పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
- నీటి అలభ్యత కారణంగా ఈ ఏడాది విడుదల ఇప్పటికే ఆలస్యం
కృష్ణమ్మకు శాస్త్రోకంగా పూజలు నిర్వహించిన అనంతరం తూర్పు డెల్టా ఆయకట్టుకు ఈరోజు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. వర్షాభావం, నీటి అలభ్యత కారణంగా జలాల విడుదల ఈ ఏడాది ఇప్పటికే ఆలస్యమైంది. దీంతో ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వేదపండితులు కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం 9.47 గంటలకు గేట్లు ఎత్తి ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటిని విడతల వారీగా విడుదల చేస్తామని తెలిపారు. చివరి భూమికి కూడా సాగు నీరు అందేలా చూడాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని, ఆయన ఆదేశాలు పాటిస్తామని తెలిపారు. పది రోజుల తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్, పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సాగునీటి శాఖ అధికారి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.