Srikath Reddy: 40 ఏళ్ల అనుభవం కాదు.. సంస్కారం ఉండాలి: శ్రీకాంత్ రెడ్డి
- తప్పుడు ఆధారాలతో సభను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోంది
- చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు
- ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు
సున్నా వడ్డీపై అధికార, విపక్షాల మధ్య ఏపీ అసెంబ్లీలో మాటల తూటాలు పేలుతున్నాయి. సున్నా వడ్డీకి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యలు దారుణమంటూ టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, సున్నా వడ్డీపై నిన్ననే చర్చ జరిగిందని... బీఏసీ నిర్ణయం ప్రకారం ఈరోజు రైతు సమస్యలపై చర్చ జరగాలని... వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమంపై వెనుకడుగు వేయదని చెప్పారు. తప్పుడు ఆధారాలతో సభను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అన్నారు.
సున్నా వడ్డీపై టీడీపీ చెబుతున్నవన్నీ కాకిలెక్కలేనని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. 40 ఏళ్ల అనుభవం కాదు, సంస్కారం ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సభలో చంద్రబాబు బెదిరిస్తూ మాట్లాడారని తెలిపారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.