Andhra Pradesh: చంద్రబాబుకూ రూ.కోటి మంజూరు చేస్తా.. ఆయన కూడా తన నియోజకవర్గంలో తిరగొచ్చు!: సీఎం జగన్

  • ఏపీలో కరవు కారణంగా నీటి ఎద్దడి నెలకొంది
  • ఎమ్మెల్యేలు నీటి ఎద్దడిని తెలుసుకునేందుకు నియోజకవర్గాల్లో పర్యటించాలి
  • ఏపీలో కరవుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటికి తీవ్రమైన ఇబ్బంది నెలకొందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతీ ఎమ్మెల్యేకు రూ.కోటి నిధులను కేటాయిస్తున్నామని వెల్లడించారు. ప్రతీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో నీటి ఎద్దడిని తెలుసుకునేందుకు పర్యటించాల్సిందిగా తాను కోరుతున్నట్లు చెప్పారు.

ఈ సొమ్ముతో ట్యాంకర్లు ఏర్పాటు చేస్తారో, బోర్లు వేయిస్తారో, ట్యాంకర్లు రిపేర్లు చేయిస్తారో అన్నది ఎమ్మెల్యేల ఇష్టమని వ్యాఖ్యానించారు. ఇలా ప్రతీ ఎమ్మెల్యే చేతిలో కోటి రూపాయల డబ్బులు పెడతామనీ, ప్రభుత్వం వీరికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి మాటను గత ప్రభుత్వాలు ఏవీ చెప్పలేదనీ, అలా చెప్పడాన్ని తాను చూడలేదని అన్నారు. ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ఈరోజు మాట్లాడారు.

‘ఈరోజు నేను చెబుతున్నా అధ్యక్షా.. మా ఎమ్మెల్యేలకే కాదు అధ్యక్షా.. ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలకు కూడా రూ.కోటి నగదు ఇస్తాం అధ్యక్షా.. ఈ నిధులను డైరెక్టుగా సీఎం డెవలప్ మెంట్ ఫండ్ నుంచే ఇస్తున్నాం. కులాలు చూడం-మతాలు చూడం-ప్రాంతాలు చూడం-రాజకీయాలు చూడం-చివరికి పార్టీలు కూడా చూడం అన్నది మా విధానం అధ్యక్షా..

ఈ కార్యక్రమంలో నిధుల జారీ విషయంలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి తేడా చూపబోం. ఈ సీఎం అభివృద్ధి నిధి నుంచి ఏపీ ప్రతిపక్ష నేతకు(చంద్రబాబుకు) నిధులు కేటాయిస్తాం అధ్యక్షా. ఆయన కూడా ప్రజల్లో తిరిగి వారికి చేయగలిగిన మేలు చేయవచ్చు అధ్యక్షా’ అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Jagan
YSRCP
Chief Minister
  • Loading...

More Telugu News