Kanna Lakshminarayana: ఎవరితోనైనా స్నేహం చేసుకోండి.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే మాత్రం ఊరుకోం: జగన్ ను ఉద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ
- శ్వేతపత్రాలను విడుదల చేసి ఊరుకోవడం సరికాదు
- గత ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి
- అవసరమైతే ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రాలను విడుదల చేసి ఊరుకోవడం సరికాదని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఇకపై పార్టీని నడిపే సామర్థ్యం లేదని ఆ పార్టీ నేతలు గుర్తించారని అన్నారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని అన్నారు. చంద్రబాబుతో మళ్లీ కలిసే అవకాశం లేదని తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎవరితో స్నేహం చేసినా తమకు అభ్యంతరం లేదని... అయితే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.