Andhra Pradesh: కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణలో కడుతుంటే చంద్రబాబు ఐదేళ్లు గాడిదలు కాశాడా?: సీఎం జగన్

  • నేను సీఎం హోదాలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లా
  • నేను వెళ్లినా, వెళ్లకున్నా ప్రాజెక్టు ప్రారంభమయ్యేది
  • టీడీపీ నేతలకు సామెతలు తెలియవు.. మాట్లాడటం అస్సలు రాదు

కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో వ్యతిరేకించిన సీఎం జగన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభోత్సవానికి వెళ్లడంపై టీడీపీ నేతలు ప్రశ్నలు కురిపించడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అందుకు స్పందించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లింది ఎప్పుడు అధ్యక్షా. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యాక. జగన్ పోయినా, పోకపోయినా వాళ్లు బటన్ నొక్కేవాళ్లు. నీళ్లు పోయేవి. నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఐదేళ్లు ఈయన సీఎంగా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్లు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడతాఉంటే ఈయన ఇక్కడ ఏం గాడిదలు కాశాడు అని అడుగుతున్నా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘టీడీపీ నేతలకు సామెతకు అర్థం తెలీదు. ఎలా మాట్లాడాలో అంతకన్నా తెలియదు’ అని దుయ్యబట్టారు. ‘ఇంకోటి అడుగుతున్నా అధ్యక్షా. వీళ్లు ఇక్కడ అధికారంలో ఉండగానే ఆల్మట్టి డ్యామ్ కడతా ఉన్నారు. ఎన్డీయేలో చంద్రబాబు చక్రం తిప్పుతున్న పరిస్థితుల్లోనే ఆల్మట్టి ఎత్తును కూడా పెంచేశారు. దీనివల్ల గత 47 ఏళ్ల సరాసరి  తీసుకుంటే మనకు 1100 టీఎంసీలు వచ్చినట్లు ఉంది. అదే సమయంలో గత 10 సంవత్సరాల్లో కృష్ణానది నుంచి ఎన్నినీళ్లు కిందకు వస్తున్నాయో చూస్తే ఈ సంఖ్య 500-600 టీఎంసీలకు పడిపోయింది’ అని సీఎం జగన్ తెలిపారు. 

Andhra Pradesh
Jagan
Chief Minister
Telugudesam
Telangana
kaleswaram
  • Loading...

More Telugu News