DK Shivakumar: ఎంతో సిగ్గుపడాల్సిన విషయం ఇది: డీకే శివకుమార్
- అధికారిక పర్యటన నిమిత్తం ముంబై వచ్చా
- బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది
- హోటల్ లోకి కూడా ప్రవేశించకుండా అడ్డుకున్నారు
ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు అక్కడకు వెళ్లిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. రెబల్స్ బస చేసిన హోటల్ వద్ద ఆయనను నిలువరించిన పోలీసులు... ఆ తర్వాత అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అనంతరం బలవంతంగా బెంగళూరు విమానం ఎక్కించారు. ఈ ఘటనపై శివకుమార్ మండిపడ్డారు.
'ఆతిథ్యానికి ముంబై మారు పేరు. అధికారిక పర్యటన నిమిత్తం నేను ముంబై వచ్చాను. స్నేహితులు, సహచరులను కలుసుకునేందుకు అదే హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నా. కానీ బీజేపీ ప్రభుత్వం, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం' అని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల అండతోనే తనను హోటల్ లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని చెప్పారు.
మరోవైపు, కుమారస్వామి, డీకే శివకుమార్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో... కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈరోజు రాజీనామా చేసే అవకాశం ఉంది.