Buggana: పోతూ పోతూ రాష్ట్రాన్ని నాశనం చేసి పోయారు: గత ప్రభుత్వంపై బుగ్గన విమర్శలు

  • శ్వేతపత్రం విడుదల చేసిన ఆర్థిక మంత్రి
  • గత ప్రభుత్వంపై విమర్శలు
  • ప్రత్యేకహోదా అంశాన్ని నీరుగార్చారంటూ మండిపాటు

ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని, వాళ్లు చెప్పిందల్లా, తాము ప్రత్యేక హోదా రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రహిత రాష్ట్రాలు అని చూడడంలేదని, తమ పరిధిలో కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మాత్రమే వెల్లడించారని బుగ్గన వివరించారు. ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉంటే ,ఆ రాష్ట్రం ప్రత్యేక హోదా రాష్ట్రం కాకపోయినా సరే తాము నిధులు ఇస్తామని ఆర్థిక సంఘం చెప్పిందని తెలిపారు.

ఈ కారణంగానే ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్యాకేజి వచ్చిందని మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్నే తాము అప్పటి అసెంబ్లీలో చెబితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, 'మీకు తెలియదు, మీకు తెలియకపోతే ట్యూషన్ పెట్టించుకోండి' అన్నారని బుగ్గన పేర్కొన్నారు. చివరికి ఎన్నికల ముందు తమ ధర్మపోరాట దీక్ష కాన్సెప్ట్ నే కాపీ కొట్టి తాము చెప్పిందే చెబుతూ, ప్రత్యేకహోదాపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అప్పటికి చేసిందంతా చేశారని, ప్రత్యేకహోదా అంశాన్ని డ్యామేజి చేసి, ప్యాకేజి అని మాట్లాడుతూ ఘోరమైన స్థితిలోకి రాష్ట్ర ఆర్థికస్థితిని పడవేశారని మండిపడ్డారు.

2019లో పోతూపోతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసి వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లూ ఆర్థిక పరిస్థితి ఓవర్ డ్రాఫ్టులోనే ఉందని, దాదాపు రూ.18 వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. 2018-19కి గాను ఏపీ పవర్ డిస్కమ్స్ కు దాదాపు రూ.8000 కోట్లు రావాల్సి ఉంటే, కేవలం రూ.2500 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. పౌరసరఫరాల శాఖ తరఫున రూ.4800 కోట్లు తీసుకుని వాటిని వేరే కార్యక్రమాల కోసం వినియోగించారని ఆరోపించారు. ఏంటని నిలదీస్తే పసుపు-కుంకుమ పేరు చెబుతారని విమర్శించారు.

ఆఖరికి చంద్రన్న కానుకలు కూడా పౌరసరఫరాల డబ్బుతోనే కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. ఏ శాఖలో చూసినా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు కచ్చితంగా చెల్లించారని, కానీ అంగన్ వాడీ వర్కర్లకు, మధ్యాహ్న భోజనానికి, ఔట్ సోర్సింగ్ వర్కర్ల జీతాలు, హోంగార్డుల జీతాలు, చివరికి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయంటూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News