Nara Lokesh: నారా లోకేశ్ కు మద్దతుగా దివ్యవాణి వ్యాఖ్యలు
- మాట్లాడితేనే నాయకుడా?
- లోకేశ్ కు బుద్ధిబలం ఉంది
- పరిపానలకు కావాల్సింది అదే
టీడీపీ యువనేత నారా లోకేశ్ ను వైసీపీ నేతలు పదేపదే టార్గెట్ చేస్తుండడం పట్ల టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఘాటుగా స్పందించారు. లోకేశ్ ను ట్విట్టర్ పిట్ట అంటూ సంబోధిస్తుండడం పట్ల ఆమె మాట్లాడుతూ, ట్విట్టర్ లో పోస్టులు చేయాలంటే రెండేళ్లపాటు జైల్లో ఉండాలా? అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితేనే నాయకుడు కాదని, ఆలోచనా శక్తి ఉన్నవాడే నాయకుడని, అలాంటి ఆలోచనా శక్తి లోకేశ్ కు పుష్కలంగా ఉందని దివ్యవాణి పేర్కొన్నారు. పరిపాలనకు కావాల్సింది బుద్ధిబలం అని, లోకేశ్ బుద్ధిబలం గురించి ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు.
ఇక సీఎం జగన్ పైనా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. భవనాలను కూల్చివేయడం అభివృద్ధి అనిపించుకోదని, నిర్మించేవాడే నాయకుడని అన్నారు. "రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా అనేక సంక్షేమ పథకాలతో పాటు, రాజధానిని నిర్మించిన ఘనత చంద్రబాబు సొంతం. చంద్రబాబుకు ఉన్న ప్రజాదరణ దేశంలో ఎవరికైనా ఉందా? నరేంద్ర మోదీకి పోటీ వచ్చే నాయకుడు చంద్రబాబు ఒక్కరే. ఏ విషయంలోనైనా మోదీని మించిన వ్యక్తి చంద్రబాబు. అందుకే ఏపీలో తెలుగుదేశం పార్టీని అందరూ కలిసి ఓడించారు" అంటూ ఆరోపించారు.