cricket world cup: నిన్న రెండోసారి వర్షం టీమిండియాకు మేలు చేసిందా?

  • మ్యాచ్‌ కొనసాగి ఉంటే భారత్‌కు కష్టమైన టార్గెట్‌
  • 20 ఓవర్లలో 148 పరుగులు చేయాల్సి వచ్చేది
  • కివీస్‌ స్వింగ్‌తో లక్ష్య సాధన కష్టమయ్యేది

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నిన్న ఆగిపోయిన మ్యాచ్‌ వల్ల భారత్‌కు మేలే జరిగిందంటున్నారు క్రికెట్ పండితులు. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రఫోర్డ్‌ మైదానంలో క్రికెట్‌ ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌ డేకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండోసారి భారీ వర్షం మొదలై ఇక మ్యాచ్‌ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో వాయిదా తప్పలేదు.

ఇక మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్‌ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రెండోసారి వర్షం ఆటంకం కలిగించకుండా మ్యాచ్‌ కొనసాగి ఉంటే డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో భారత్‌కు 20 ఓవర్లలో 148 పరుగుల లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉండేది. ఎందుకంటే కనీసం 20 ఓవర్ల ఆటసాగితే ఈ నిబంధన వర్తిస్తుంది. నిన్నటి మ్యాచ్‌లో అసలే పిచ్‌ మందగమనంగా ఉంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిల్యాండ్‌ తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. తొలి పవర్‌ ప్లేలో ఆ జట్టు ఒక వికెట్టు కోల్పోయి కేవలం 27 పరుగులే చేసింది. దీన్నిబట్టి పిచ్‌ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇక, వర్షం తర్వాత పిచ్‌ పరిస్థితిలో మరింత మార్పు వచ్చేది. అటువంటి పిచ్‌పై పరుగుల వరద పారించడం అంత ఈజీ కాదన్నది క్రికెట్‌ పండితుల మాట. పైగా మబ్బుపట్టిన వాతావరణంలో కివీస్‌ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేదని, అదే జరిగితే లక్ష్య సాధన భారత్‌కు కష్టమయ్యేదన్నది వీరి విశ్లేషణ. మొత్తమ్మీద అభిమానుల ఆశలపై నీళ్లు చల్లకుండా వరుణుడు కాపాడాడు. ఈరోజు కూడా వాతావరణంలో పెద్దగా మార్పులేదు. మ్యాచ్‌ కొనసాగకుంటే పర్వాలేదని, కానీ డక్‌వర్త్‌లూయీస్‌ పద్ధతిలో మాత్రం మ్యాచ్‌ జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

cricket world cup
manchester
rain effect
good for India
  • Loading...

More Telugu News