shami: ఇంతకన్నా ఎవరైనా ఎలా ఆడాలి?: షమీని ఎంపిక చేయకపోవడంపై కోచ్ విమర్శలు
- నాలుగు మ్యాచ్ లలో 14 వికెట్లు తీసుకున్న షమీ
- సెమీస్ కు షమీని ఎంపిక చేయని మేనేజ్ మెంట్
- విమర్శలు గుప్పించిన షమీ కోచ్
కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడి, ఏకంగా 14 వికెట్లను తీసుకున్న భారత ప్రధాన బౌలర్ షమీని, నిన్నటి సెమీఫైనల్ మ్యాచ్ లో పక్కన బెట్టడంపై టీమిండియా యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, తాజాగా షమీ కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జట్టు మేనేజ్ మెంట్ ఫాస్ట్ బౌలర్ల నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తోందో తెలియడం లేదని విమర్శించారు. భువనేశ్వర్ బ్యాటింగ్ కూడా చేయగలడన్న కారణంతోనే అతన్ని తీసుకున్నారన్న వాదనే నిజమైనదా? అని ప్రశ్నించారు. టాప్ ఆర్డర్ లో ఉన్న ఆరుగురు ఆటగాళ్లు బాధ్యతతో ఆడితే, మిగతా వారితో అవసరం ఏంటని ప్రశ్నించారు. బాల్ తో ఆడి తన జట్టును గెలిపించడమే షమీ కర్తవ్యమని, గడచిన నాలుగు మ్యాచ్ లలో షమీ ఆ పనే చేశాడని అన్నారు. కాగా, సెమీస్ లో షమీ స్థానంలో భువనేశ్వర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.