Delta flight: విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ ఫెయిల్.. చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన 150 మంది ప్రయాణికులు!
- అమెరికాలోని అట్లాంటాలో ఘటన
- డెల్టా విమానం బాల్టిమోర్ కు వెళుతుండగా ప్రమాదం
- ప్రొపెల్లర్స్ లోకి దూసుకెళ్లిన ఇంజిన్ ముందుభాగం
విమాన ప్రయాణాలు అనగానే చాలామందికి తెలియని భయం ఉంటుంది. తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గత సోమవారం చోటుచేసుకున్న ఘటన చూస్తే వాళ్లందరి ఒళ్లు జలదరిస్తుంది. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నుంచి డెల్టా ఫ్లైట్ 1425 అనే విమానం బాల్టిమోర్ నగరానికి బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం ఇంజిన్ లోని ముందుభాగం ఊడిపోయి వేగంగా తిరుగుతున్న ప్రొపెల్లర్స్ లోకి వెళ్లి ఇరుక్కుంది.
దీంతో పెద్దశబ్దంతో మంటలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే దీన్ని గుర్తించిన పైలెట్లు ఉత్తరకరోలినా రాష్ట్రంలోని ఓ ఎయిర్ పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదాన్ని ఓ ప్రయాణికుడు తన ఫోన్ లో వీడియో రికార్డు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ సందర్భంగా తాము చనిపోతామని భావించిన పలువురు ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులకు చివరి సందేశాలు పంపుకున్నారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను మరో విమానంలో బాల్టిమోర్ కు పంపినట్లు డెల్టా కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.