Spice Jet: విమానం హైడ్రాలిక్ ఫ్లాప్ మధ్య ఇరుక్కుని ఉద్యోగి దుర్మరణం... మృతదేహాన్ని రెండు భాగాలు చేసి బయటకు తీసిన వైనం!
- కోల్ కతాలోని విమానాశ్రయంలో ఘోర దుర్ఘటన
- ఒక్కసారిగా అధిక ఒత్తిడితో మెడను పట్టేసిన ఫ్లాప్స్
- ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
కోల్ కతాలోని డమ్ డమ్ విమానాశ్రయంలో ఘోర దుర్ఘటన జరిగింది. స్పైస్ జెట్ కు చెందిన ఓ ఏటీఆర్ విమానానికి మరమ్మతులను నిర్వహిస్తున్న వేళ, విమానం హైడ్రాలిక్ ఫ్లాప్స్ కదలడంతో, దాని మధ్య ఓ ఉద్యోగి తల ఇరుక్కుపోయి మరణించాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా, విమానం ఫ్లాప్స్ ను అతను పరిశీలిస్తుండగా, ఈ ఘటన జరిగిందని, అధిక ఒత్తిడితో ఫ్లాప్స్ అతని తలను బిగించేశాయని, వెంటనే అతను మరణించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత అతని తలను బయటకు తీసేందుకు శరీరం నుంచి వేరు చేయాల్సి వచ్చిందని అన్నారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని, ఇది ఓ అసాధారణ దురదృష్టకరమైన ఘటన అని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.