team India: అనుకున్నదొకటి.. అవుతోంది ఇంకోటి.. నేడు కూడా వర్షం పడితే భారత్‌కు ప్రతికూలమే!

  • మందకొడిగా మారుతున్న పిచ్
  • ఛేజింగ్ కష్టసాధ్యంగా మారే అవకాశం
  • ఓవర్లు కుదిస్తే భారత్‌కు చేటే

ప్రపంచకప్ సెమీస్‌లో భారత జట్టు పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయి. వర్షం పడితే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుందన్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరిస్తున్నాడు. నిజానికి మంగళవారమే మ్యాచ్ ఫలితం తేలిపోవాల్సి ఉండగా వర్షం కారణంగా నేటికి మారింది. ఒకవేళ నేడు కూడా వర్షం పడి ఆటకు అంతరాయం కలిగితే భారత అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

బ్యాటింగ్‌కు సహకరించని పిచ్ వర్షం తర్వాత మరింత మందకొడిగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఎంత బలంగా బాదినా బంతి బౌండరీకి వెళ్లడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బౌండరీలు ఆశించడం అత్యాశే అవుతుంది. ఫలితంగా ఛేజింగ్ కష్టతరంగా మారొచ్చు. నేడు ఆట కొనసాగితే కివీస్ స్కోరు గరిష్టంగా 250 పరుగులకే చేరొచ్చు. సాధారణ పరిస్థితుల్లో, ముఖ్యంగా టీమిండియాకు ఇది పెద్ద సమస్యేమీ కాదు. అయితే, వర్షం కారణంగా పిచ్ జీవం కోల్పోవడమే ఇప్పుడు అసలు సమస్య. ‌బౌలింగ్ లైనప్ బలంగా ఉన్న న్యూజిలాండ్‌ను ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవడం కష్టమే అవుతుంది.

వర్షం పడకుండా ఆట మళ్లీ కొనసాగితే ఎలాగోలా నెట్టుకు రావొచ్చు. ఒకవేళ నేడు కూడా వర్షం పడి డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి అమల్లోకి వస్తే మాత్రం కోహ్లీసేనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఓవర్లు కుదించినా భారత్ ఎదుట కొండంత లక్ష్యం ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి గుడ్డిలో మెల్లలా.. వరుణుడు అడ్డం రాకుండా ఆట కొనసాగితే భారత్‌ కొంత వరకు ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. లేదంటే టఫ్ ఫైట్ తప్పదన్నట్టే. మరి నేడు మాంచస్టర్‌ను వరుణుడు వీడుతాడో లేదో వేచి చూడాలి.

team India
new zealand
icc world cup
Rain
  • Loading...

More Telugu News