India: వన్డే మ్యాచా? టెస్ట్ మ్యాచా?.... మొదటి పవర్ ప్లేలో ప్లాన్ పక్కాగా అమలు చేసిన టీమిండియా
- 10 ఓవర్లలో కివీస్ స్కోరు 27/1
- దూకుడు లోపించిన కివీస్
- పరుగులు సాధించేందుకు ఆపసోపాలు
వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ కు టీమిండియా బౌలర్లు తొలి పవర్ ప్లేలో ఆ ఆనందం లేకుండా చేశారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతూ కివీస్ టాపార్డర్ కు అగ్నిపరీక్ష పెట్టారు. కొన్నిబంతులు ఆడాలో వద్దో తెలియని పరిస్థితి సృష్టించి ఎంతో తెలివిగా మార్టిన్ గప్టిల్ ను బుమ్రా బుట్టలో వేసిన వైనం అద్భుతం అని చెప్పాలి. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్లకు అడ్వాంటేజ్ ఉంటుందని భావించినా, ఇవాళ్టి సెమీస్ లో మాత్రం కివీస్ కు భిన్నమైన అనుభవం ఎదురైంది. ఆ జట్టు తొలి పవర్ ప్లేలో కనీస ప్రభావం చూపలేకపోయింది.
భారత బౌలర్లు మూలాలకు కట్టుబడి ఎంతో ప్రణాళికబద్ధంగా బంతులు విసరడంతో, కివీస్ జట్టు తొలి ఫోర్ కొట్టడానికి 7.5 ఓవర్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు చేసిన పరుగులు 27 మాత్రమే. అప్పటికి ఓ వికెట్ కూడా కోల్పోయింది. మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ ఆడుతున్న విధానం చూస్తుంటే ఇది వన్డే మ్యాచా? లేక, టెస్ట్ మ్యాచా? అనే సందేహం కలుగుతోంది! క్రీజులో విలియమ్సన్, నికోల్స్ వంటి హేమాహేమీలున్నా స్కోరుబోర్డు నత్తనడకన ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 44 పరుగులు.