Andhra Pradesh: మేం తిరుగుబాటు చేస్తే మీరు ఊర్లలో తిరగలేరు.. వైసీపీ నేతలకు నారా లోకేశ్ హెచ్చరిక!

  • పట్టిసీమ దండగన్న జగన్ ఇప్పుడేం చెబుతారు?
  • 2004లో వైఎస్ టీడీపీని ఇబ్బంది పెట్టారు
  • టీడీపీని భూస్థాపితం చేస్తామన్నవాళ్లు ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు

వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు దండగ అనీ, అక్రమ కట్టడం అని విమర్శించారనీ, ఇప్పుడేం చెబుతారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. పట్టిసీమ వద్ద గోదావరి నదికి టీడీపీ నేతలతో కలిసి నారా లోకేశ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా. పట్టి సీమ ప్రాజెక్టు దండగ అని చెప్పిన మీరు ఇప్పుడు ఆ విషయంలో ప్రజలకు క్షమాపణలు చెబుతారా? రైతులకు జగన్ ఈరోజు ఏం సమాధానం ఇస్తారు? గతంలోనూ టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.

2004లో వైఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు, నేతలను హత్య చేశారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలకు నేను ఒకటే హామీ ఇస్తున్నా. మీ జోలికి ఎవరైనా వస్తే తెలుగుదేశం సైన్యం మీకు అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. ‘అలాగే నేను వైసీపీ నాయకులను కూడా హెచ్చరిస్తున్నా. అయ్యా.. మా ఓపికను పరీక్షించకండి. మేం తిరుగుబాటు చేస్తే మీరు గ్రామాల్లో తిరగలేరు, ఉండలేరు’ అని లోకేశ్ హెచ్చరించారు. టీడీపీ భూస్థాపితం అయిపోతుందని హెచ్చరించినవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో అందరం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు.

Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
YSRCP
Jagan
Chief Minister
  • Loading...

More Telugu News