Virat Kohli: ఆ సమయంలో రెండు తప్పులు చేస్తే.. మ్యాచ్ ప్రత్యర్థి చేతుల్లోకి పోతుంది: కోహ్లీ
- సెమీస్ లో ఒత్తిడి కీలకంగా మారుతుంది
- ఒత్తిడిని ఎదుర్కొన్న జట్టు విజయం సాధిస్తుంది
- ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి
ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ను టీమిండియా ఢీకొనబోతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ, సెమీస్ లో ఒత్తిడి కీలకంగా మారుతుందని... దాన్ని జయించిన జట్టు విజయం సాధిస్తుందని చెప్పాడు. పిచ్ స్వభావం ఏమిటనేది ముఖ్యం కాదని... పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటమే ప్రధానమని తెలిపాడు. టాస్ గెలవడం మన చేతుల్లో లేదని... దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాడు. పూర్తి విశ్వాసంతో ఉండాలని... ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని తెలిపాడు.
రెండో ఇన్నింగ్స్ ఆడేటప్పుడు ఛేజింగ్ లో ఎంతో ఒత్తిడి ఉంటుందని కోహ్లీ అన్నాడు. ఆ సమయంలో రెండు తప్పులు చేసినా... మ్యాచ్ ప్రత్యర్థుల చేతిలోకి వెళ్లిపోతుందని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ ను మన చేతుల్లోకి తీసుకురావాలంటే చాలా కష్టమని తెలిపాడు. తాను ఎన్నో ఛేజింగ్ లు చూశానని... ఆ అనుభవంతోనే ఈ మాట చెబుతున్నానని అన్నాడు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా టీమిండియా సిద్ధంగా ఉందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.