Karnataka: కర్ణాటక నంబర్ గేమ్.. తన వద్ద 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న యడ్యూరప్ప
- బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు
- సమస్య పరిష్కారమైందని ప్రకటించిన కుమారస్వామి
- రాజీనామాలపై నేడు స్పీకర్ విచారణ
చూస్తుంటే కర్ణాటక రాజకీయం తుది అంకానికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. రాజీనామా చేసిన కూటమి ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకపోవడం, వారికి మరో ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలు జత కావడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏ క్షణాన్నైనా కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముుఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తన చేతిలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని యడ్యూరప్ప తాజాగా పేర్కొన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు గవర్నర్‌ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తామని లేఖలు ఇచ్చారని, దీంతో తమ బలం 107కు చేరుకుందన్నారు. ఇప్పుడేం జరుగుతుందో చూద్దామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, సమస్య పరిష్కారమైందని, ఇక చింతించాల్సిన పనిలేదని, ప్రభుత్వం సాఫీగా సాగిపోతుందని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన కాసేపటికే యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా, రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేశ్ కుమార్ నేడు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో ఇవ్వలేదని భావిస్తే విచారణను వాయిదా వేసే అవకాశం ఉంది.