Srinivasa Reddy: తోటి విద్యార్థులు కొట్టి వేధిస్తున్నారంటూ.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

  • డబ్బులు తెమ్మని వేధిస్తున్న తోటి విద్యార్థులు 
  • చీరతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు

 హైదరాబాద్ శివారు సరూర్‌నగర్‌లో తోటి విద్యార్థులు వేధిస్తున్నారంటూ, ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, కర్మాన్‌ఘాట్‌లోని నియో రాయల్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఇద్దరు తోటి విద్యార్థులు డబ్బులు తేవాలంటూ తనను కొట్టి వేధిస్తున్నారని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి, కొక్కేనికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గది తలుపులు మూసి ఉన్న విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు వాటిని తెరిచే ప్రయత్నం చేయడంతో లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో కిటికీ నుంచి చూసిన తల్లిదండ్రులు.. తలుపులు బద్దలు కొట్టి విద్యార్థిని హుటాహుటిన గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు వెల్లడించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా, నాన్న తనను క్షమించాలంటూ సూసైడ్ నోట్‌లో విద్యార్థి పేర్కొన్నాడు. తమ స్కూల్లోని ఇద్దరు విద్యార్థులు డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నారని పేర్కొన్నాడు. ఓ విద్యార్థి రూ.1000 తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాడని, మరో విద్యార్థి తనను బ్లాక్ మెయిల్ చేసి రూ.6000 తీసుకున్నాడని తెలిపాడు. ‘ఐ మిస్సింగ్ యూ అమ్మా’ అని విద్యార్థి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.  

Srinivasa Reddy
Karmanghat
Suicide Attempt
Global Hospital
Suicide Note
Niyo Rayal School
  • Loading...

More Telugu News