Gold: బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడానికి కారణం ఇదేనట!
- విదేశీ కరెన్సీని ఖర్చు చేసుకోవడం మంచిది కాదు
- టన్నుల కొద్దీ అవసరం లేదు
- కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకుంటే చాలు
బడ్జెట్ సందర్భంగా బంగారంపై 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఒక్కసారిగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడానికి గల కారణాన్ని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అత్యవసరం కాని వస్తువుల దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచిందని అజయ్ తెలిపారు. అవసరం లేని వస్తువుల దిగుమతి కోసం మన విదేశీ కరెన్సీని ఖర్చు చేసుకోవడం మంచిది కాదని, వీటిలో బంగారం ఒకటని అన్నారు. బంగారాన్ని టన్నుల కొద్దీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని, కొద్ది మొత్తంలో చేసుకుంటే చాలని అన్నారు.