Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరుకాకుండా అడ్డుకున్న వైసీపీ శ్రేణులు!
- ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘటన
- ‘రైతు భరోసా’ కార్యక్రమం కోసం వచ్చిన కొండపి ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి
- వెనక్కి వెళ్లిపోవాలంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే, టీడీపీ నేత బాల వీరాంజనేయస్వామికి ఈరోజు చేదు అనుభవం ఎదురయింది. జిల్లాలోని ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు కల్యాణ మండపం గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే లోపలకు వెళ్లేందుకు ఒప్పుకోబోమనీ, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు ఇచ్చారు. ఈ ఘటనపై బాల వీరాంజనేయస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు తాను పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చానని తెలిపారు. అయినా తనకు పోలీసులు రక్షణ కల్పించలేదని అన్నారు. ఓ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్న తనను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.