Andhra Pradesh: జగన్ గారూ, అబద్ధాలకు కూడా ఇంత డబ్బులు తగలేయాలా?: నారా లోకేశ్
- 2019లో జనవరి- జూన్ వరకు రూ.2 వేలు పెన్షన్ ఇచ్చాం
- అందులో ఐదు నెలల పాటు చంద్రబాబే సీఎంగా ఉన్నారు
- ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. 2019 జనవరి నుంచి జూన్ నెలవరకూ చంద్రబాబు నెలకు రూ.2,000 పెన్షన్ ఇచ్చారని లోకేశ్ గుర్తుచేశారు. అయితే ఈ విషయాన్ని జగన్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రకటనలో అన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఇందుకు భారీగా డబ్బులు తగలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ.. ‘అయ్యా జగన్ గారు, అబద్ధాలకు కూడా, ఇంత డబ్బులు తగలెయ్యాలా ? జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు అంటే ఆరు నెలల పాటు 2 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? అందులో 5 నెలల పాటు చంద్రబాబు సీఎంగా ఉండగా ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా ? ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా ?’ అని ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు వార్తాపత్రిక క్లిప్ ను లోకేశ్ జతచేశారు.