Andhra Pradesh: రాజన్న అని పిలిస్తే పలుకుతాడు అనే ధైర్యాన్ని వైఎస్ ప్రజల్లో కల్పించారు!: విజయసాయిరెడ్డి
- ఆయన ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్సులు తీసుకొచ్చారు
- ఫీజుల చెల్లింపుతో పేదల చదువుల కలలను నిజం చేశారు
- వైఎస్ హయాంలో పిలవకున్నా వరుణదేవుడు పలికేవాడు
ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు ప్రవేశపెట్టిన డా.వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోరని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ఫీజు చెల్లింపు పథకంతో పేదల చదువుల కలలను నిజం చేసిన చిరస్మరణీయుడు వైఎస్ అని ప్రశంసించారు. రాజన్న అని పిలిస్తే పలుకుతాడు అనే ధైర్యం ప్రజలకు కల్పించిన మహా మనీషి రాజశేఖరరెడ్డని వ్యాఖ్యానించారు.
ఈరోజు వైఎస్ 70వ జయంతి సందర్భంగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘వరుస కరవులతో కుదేలైన వ్యవసాయ రంగానికి వైఎస్ ఊపిరి పోశారు. ఉచిత విద్యుత్తు, రుణమాఫీలతో పాటు అనేక సాగునీటి పథకాలు చేపట్టారు. ఆయన సీఎంగా ఉన్న అన్నిరోజులూ వరుణదేవుడు పిలవకుండానే పలికేవాడు. సీఎంగా చెరగని ముద్ర వేసిన మహనీయడైన డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి నిజంగా పండుగ దినం’ అని ట్వీట్ చేశారు.