Karnataka: కుమారస్వామి చివరి ప్రయత్నం.. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆఫర్!

  • కుమారస్వామి నేడు కేబినెట్ మీట్
  • కొందరు మంత్రులతో రాజీనామా
  • మొదటి రాజీనామా తనదేనన్న డీకే శివకుమార్

ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన 13 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేసింది. అలాగే వారి నియోజకవర్గాలకు ఉదారంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ ఆఫర్‌ను కూడా వారు తిరస్కరించినట్టు సమాచారం.

వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన కుమారస్వామి ఆదివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. నేడు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులతో రాజీనామా చేయించి, వాటిని రెబల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామాల విషయంలో తాను ముందు వరుసలో ఉన్నట్టు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, జలవనరుల శాఖా మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తాను దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు.

అయితే, శనివారం నుంచి ముంబైలోని లగ్జరీ హోటల్లో ఉంటున్న రెబల్ ఎమ్మెల్యేలు పదిమంది కుమారస్వామి ఆఫర్‌ను రాత్రికి రాత్రే తిరస్కరించారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని, రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని తేల్చి చెప్పారు. త్వరలోనే తామంతా బీజేపీలో చేరబోతున్నట్టు రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ తెలిపారు.

Karnataka
Kumaraswamy
DK Shiva kumar
rebal MLAs
Congress
BJP
  • Loading...

More Telugu News