Uttar Pradesh: సోషల్ మీడియాలో కొడుకు పెడుతున్న కష్టాలు చెప్పుకుని బోరుమన్న వృద్ధ దంపతులు.. సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్

  • కోడలితో కలిసి కొడుకు అష్టకష్టాలు పెడుతున్నాడంటూ కన్నీళ్లు
  • కష్టపడి సంపాదించిన ఇంటి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన
  • ఇల్లు ఖాళీ చేయాలంటూ కొడుకు-కోడలికి అధికారుల ఆదేశం

కొడుకు, కోడలు పెడుతున్న కష్టాలు చెప్పుకుని బోరుమన్న 68 ఏళ్ల వృద్ధ దంపతులను జిల్లా కలెక్టర్ రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన దంపతులు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. తాము కష్టపడి కట్టుకున్న ఇంటి నుంచి తమను గెంటివేయాలని చూస్తున్నారని వృద్ధుడు ఇంద్రజిత్ గ్రోవర్ ఆరోపించారు. తనకు హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయని, తన భార్యకు ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తామున్న ఇంటిని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొనుగోలు చేశామని , ఇప్పుడు తన ఒక్కగానొక్క కుమారుడు భార్యతో కలిసి తమను అష్టకష్టాలు పెడుతున్నారని, ఇంటి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

తాము ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బతికి ఉండాలో, చావాలో కూడా అర్థం కావడం లేదంటూ గద్దగ స్వరంతో చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తమకు సాయం అందించాలని, ఈ మేరకు అతనికి ఫిర్యాదు కూడా చేశానని ఇంద్రజిత్ తెలిపారు. కుమారుడు, కోడలి కంబంధ హస్తాల నుంచి తమను రక్షించి తమ స్వార్జితమైన ఇంట్లో తాము ఉండేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అర్థించారు. కొడుకు కోడలు కలిసి తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇప్పుడు తమకు చావే శరణ్యమని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఇదో కుటుంబ సమస్య అని దీనిని పరిష్కరించినట్టు తెలిపారు. ఆ ఇంటిని పది రోజుల్లోగా ఖాళీ చేయాలని వృద్ధ దంపతుల కుమారుడు, కోడలిని ఆదేశించినట్టు తెలిపారు. అంతేకాదు, ఇంటిని ఖాళీ చేస్తామని లిఖితపూర్వకంగా వారు హామీ ఇచ్చారని డీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News