Telangana: అసెంబ్లీ సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారా?: బీజేపీ నేత లక్ష్మణ్
- ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం
- సచివాలయంలో ఇబ్బందులు ఉన్నాయని ఉద్యోగులు ఎవరైనా చెప్పారా?
- వాస్తు సరిగా లేకుంటే సరిచేయాలే తప్ప కూలుస్తారా?
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మిస్తామంటున్నారని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ, అసెంబ్లీ సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు, సచివాలయంలో ఇబ్బందులు ఉన్నాయని ఉద్యోగులు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో దోచుకోవడం అయిపోయిందని, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయా నిర్మాణాల వాస్తు సరిగా లేకుంటే సరిచేసుకోవాలే తప్ప కూలుస్తారా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్ ఇవ్వొద్దని కేంద్రాన్ని ఒప్పించామని చెప్పారు.