Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లకు ముంచేసిన మరో బడా కంపెనీ!
- పీఎన్బీని మోసం చేసిన భూషన్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ
- రూ. 3,800 కోట్ల మేర మోసం
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు ఏకంగా రూ. 14వేల కోట్లకు ముంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో భాగోతం బయటపడింది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రు. 3,800 కోట్ల మేర మోసగించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ లో ఈ విషయాన్ని పీఎన్బీ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి కి కూడా తెలిపింది.
చండీగఢ్ లోని కార్పొరేట్ బ్రాంచ్ ద్వారా దాదాపు రూ. 3,200 కోట్లు, దుబాయ్ లోని బ్రాంచ్ ద్వారా రూ. 345 కోట్లు, హాంగ్ కాంగ్ బ్రాంచ్ ద్వారా రూ. 268 కోట్లను ఇచ్చినట్టు పీఎన్బీ వెల్లడించింది. గత వారంలో భూషన్ స్టీల్ ప్రమోటర్లు, ఆడిటర్లు, ఇండిపెండెంట్ డైరెక్టర్లపై ఢిల్లీలోని ఓ కోర్టుకు 70వేల పేజీల నివేదికను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అందజేసింది. భూషన్ స్టీల్ పై సీబీఐ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.