Nirav Modi: నీరవ్ మోదీకి షాక్.. పీఎన్బీకి రూ.7300 కోట్లు చెల్లించాల్సిందేనన్న డీఆర్టీ
- గతవారం నీరవ్ మోదీ సోదరి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన సింగపూర్ కోర్టు
- డీఆర్టీ వద్ద పెండింగ్‌లో మరో కేసు
- ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో నీరవ్ మోదీ
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి పూణేలోని డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ) షాకిచ్చింది. నీరవ్, అతడి అనుచరులు కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి రూ.7300 కోట్లను వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. కాగా, రూ.1700 కోట్ల మోసానికి సంబంధించి నీరవ్ మోదీపై పీఎన్బీ పెట్టిన మరో కేసు డీఆర్టీ వద్ద పెండింగ్‌లో ఉంది.
నీరవ్ మోదీ సోదరి, బావ ఆస్తులను సీజ్ చేయాలంటూ సింగపూర్ కోర్టు గతవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ షాక్ నుంచి నీరవ్ తేరుకోకముందే రూ.1700 కోట్లు చెల్లించాలంటూ డీఆర్టీ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మెహతా సారథ్యంలోని పెవిలియన్ పాయింట్ కార్పొరేషన్‌కు సంబంధించిన సింగపూర్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పీఎన్బీలో రెండు బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడి పరారైన నీరవ్ మోదీని మార్చి 19న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నీరవ్ మోదీ ప్రస్తుతం నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు.