No Parking Zone: నో పార్కింగ్‌లో వాహనం నిలిపితే రూ.23 వేల వరకూ ఫైన్ కట్టాల్సిందే.. రేపటి నుంచి ముంబైలో అమలు
- 26 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించిన ప్రభుత్వం
- ద్విచక్ర వాహనానికి రూ.5వేల నుంచి రూ.8,300 ఫైన్
- భారీ వాహనాలకు రూ.15 వేల నుంచి రూ.23,250
- మధ్యశ్రేణి వాహనాలకు రూ.11 వేల నుంచి రూ.17,600
ఇకపై నో పార్కింగ్ జోన్‌లో వాహనాన్ని నిలిపితే రూ.5 వేల నుంచి 23 వేల వరకూ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ముంబయి ట్రాఫిక్ పోలీసులు, బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా రేపటి నుంచే ముంబైలో ఈ ట్రాఫిక్ నిబంధనలను అమల్లోకి తీసుకు రానున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం 26 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించింది. ఈ ప్రదేశాలలో వాహనం నిలిపితే రూ.5 నుంచి 23 వేల వరకూ ఫైన్ విధించనుంది.
ద్విచక్ర వాహనాన్ని నో పార్కింగ్ ప్లేస్‌లో నిలిపితే రూ.5వేల నుంచి రూ.8,300 వరకు, భారీ వాహనాలకు అయితే రూ.15 వేల నుంచి రూ.23,250 వరకు, లైట్ మోటార్ వెహికల్స్‌కు రూ.10వేల నుంచి రూ.15,100 వరకు, మధ్యశ్రేణి వాహనాలకు రూ.11 వేల నుంచి రూ.17,600 వరకూ అపరాధ రుసుంను విధించనున్నారు. ఒకవేళ ఈ జరిమానాలు విధించే సమయంలో వాహనదారుల నుంచి ఇబ్బందులు తలెత్తితే ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎక్స్‌సర్వీస్ మెన్, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను బీఎంసీ నియమించుకుంది.