DK Shiva kumar: కర్ణాటక ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు: డీకే
- అక్రమంగా పొత్తును భగ్నం చేసేందుకు యత్నిస్తున్నారు
- కాంగ్రెస్-జేడీఎస్ పొత్తుకు ఎలాంటి ప్రమాదమూ లేదు
- సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే ‘ఆపరేషన్ లోటస్’
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. 11 మంది ఎమ్మెల్యేలు అంటే ఎనిమిది మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన విషయాన్ని స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ధారించారు. ప్రస్తుతం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి డీకే శివకుమార్‌ని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తన నివాసంలో ఆయన మంతనాలు కొనసాగిస్తున్నారు.
కొన్ని అంశాల్లో తాము పార్టీ నిర్లక్ష్యానికి గురవుతున్నామని, అయితే తాను మాత్రం ఎవరినీ నిందించబోనని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలతో భేటీకి ముందు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ అక్రమంగా తమ కూటమి మధ్యనున్న పొత్తును భగ్నం చేసేందుకు యత్నిస్తోందని, కానీ కాంగ్రెస్-జేడీఎస్ పొత్తుకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’కు పూనుకుందని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ పొత్తుకు వచ్చే ముప్పేమి లేదన్నారు.