Micky Arthur: ఈ పద్ధతి బాగా లేదు.. రన్ రేట్ విధానం మార్చండి!: పాక్ కోచ్ డిమాండ్
- రన్ రేట్ లేకపోవడంతో వరల్డ్ కప్ నుంచి పాక్ నిష్క్రమణ
- కివీస్ కు సెమీస్ బెర్తు
- లీగ్ దశలో కివీస్ ను ఓడించిన పాక్
పాకిస్థాన్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ నుంచి రన్ రేట్ కారణంగానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మెరుగైన రన్ రేట్ తో న్యూజిలాండ్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అయితే, తమ నిష్క్రమణకు నెట్ రన్ రేటే ప్రధాన కారణమని, ఈ విధానాన్ని మార్చాల్సిందేనని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్ మికీ ఆర్ధర్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రపంచకప్ నుంచి పాక్ నిష్క్రమణ తర్వాతే ఆర్ధర్ ఈ ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం.
అయితే ఆర్ధర్ నెట్ రన్ రేట్ పై తీవ్రస్థాయిలో స్పందించడానికి కారణం ఉంది. లీగ్ దశలో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ పై విజయం సాధించింది. తమ చేతిలో ఓడిన జట్టు సెమీస్ చేరడం ఆర్ధర్ కు మింగుడుపడడంలేదు. కానీ, తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ టీమ్ వెస్టిండీస్ చేతిలో దారుణ పరాజయం చవిచూడడం ఆ జట్టుపై చివరి వరకు ప్రభావం చూపింది. ఆ భారీ తేడానే పాక్ నెట్ రన్ రేట్ పై దెబ్బకొట్టింది. ఆ మ్యాచ్ ఓటమి గురించి మాట్లాడని పాక్ కోచ్, న్యూజిలాండ్ పై తాము గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావిస్తున్నాడు.