BJP: బీజేపీతో లింకులుంటే ఇంటికే.. నేతలను హెచ్చరించిన మమత

  • రెండు జిల్లాల పార్టీ నేతలతో మమత రహస్య సమావేశం
  • బీజేపీతో టచ్‌లో ఉన్నవారిని గుర్తించాలని సూచన
  • ఎంతమందినని గుర్తిస్తారని ఎద్దేవా చేసిన బీజేపీ నేత

పార్టీ నేతలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. బంకుర, ఝర్గామ్‌లకు చెందిన పార్టీ నేతలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రహస్య సమావేశంలో టీఎంసీ అధినేత్రి మాట్లాడుతూ.. బీజేపీతో టచ్‌లో ఉన్న నేతలను గుర్తించాలని సూచించారు. వారికి పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. నేతలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధైర్యం నూరిపోశారు.

పార్టీ నేతలందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి వారితో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఇతర పార్టీల మద్దతుదారులతో గొడవలకు దిగొద్దని హితవు పలికారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోవడం టీఎంసీకి మింగుడుపడడం లేదు. దీంతో మమత ఇటీవల ఎక్కువగా పార్టీ కార్యకలాపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినప్పటికీ బీజేపీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటి వరకు ఏడుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు, 60 మందికిపైగా కౌన్సిలర్లు, 12 మందికిపైగా జిల్లా పరిషత్ సభ్యులు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీతో టచ్‌లో ఉన్న మిగతా వారిని గుర్తించి పార్టీ నుంచి తొలగించాలని మమత యోచిస్తున్నారు.

మమత హెచ్చరికలు బయటకు రావడంతో బీజేపీ ఝర్గామ్ జిల్లా అధ్యక్షుడు సుఖ్‌మయ్ సత్పతి మాట్లాడుతూ.. ఎంతమందినని గుర్తిస్తారని మమతకు సవాలు విసిరారు. గ్రామ పంచాయతీ నుంచి శాసనసభ్యుల వరకు అన్ని స్థాయుల్లోని నేతలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

BJP
West Bengal
Mamata Banerjee
TMC
  • Loading...

More Telugu News